|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 03:52 PM
విలక్షణ నటుడు అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్‌ను పొందింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ అధికారికంగా ప్రకటించింది. అనేక మలుపులతో కూడిన ఈ థ్రిల్లర్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలని ప్రేక్షకులకు సూచించింది. ఈ సినిమాకు 'పొలిమేర', 'పొలిమేర 2' చిత్రాలతో ప్రసిద్ధి చెందిన డా. అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడంతో పాటు షోరన్నర్‌గా కూడా వ్యవహరించారు. నాని కాసరడ్డ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో అల్లరి నరేశ్ ఎంతో సీరియస్ పాత్రలో కనిపించారు. టీజర్‌లో దెయ్యాలు కొందరికే ఎందుకు కనిపిస్తాయంటూ వినపడే వాయిస్ ఓవర్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు సినిమా నేపథ్యాన్ని తెలియజేశాయి. చివర్లో అల్లరి నరేశ్ ఒకరిని కాల్చి చిరునవ్వుతో కనిపించడం ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచింది.ఈ చిత్రంలో 'పొలిమేర' ఫేమ్ డా. కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటిస్తుండగా, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Latest News