|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:01 PM
'ఐబొమ్మ' వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అతనికున్న సాంకేతిక నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు, ఏకంగా తమ శాఖలోనే ఉద్యోగం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన సందర్భంగా ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. 'సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా? మంచి జీతం ఇస్తాం' అని ఉన్నతాధికారులు అడిగినప్పటికీ, రవి దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.పోలీసులు 'నీ ఐబొమ్మ కథ ముగిసింది, తర్వాత ఏంటి నీ ప్లాన్?' అని ప్రశ్నించగా, రవి తన భవిష్యత్ ప్రణాళికలను వివరించాడు. కరేబియన్ దీవుల్లో 'ఐబొమ్మ' పేరుతోనే ఒక రెస్టారెంట్ ప్రారంభించి, భారతీయ వంటకాలను అక్కడి ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పినట్లు సమాచారం. త్వరలోనే కరేబియన్‌లోని అన్ని దేశాల్లో రెస్టారెంట్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది.సంపాదించిన డబ్బుతో ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు పైరసీ ద్వారా సంపాదించిన రూ. 20 కోట్లలో ఏకంగా రూ. 17 కోట్లను కేవలం ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేసినట్లు తేలింది. ఇకపై కూడా వారానికో దేశం తిరుగుతూ జీవితాన్ని ఆస్వాదిస్తానని అతను చెప్పినట్లు సమాచారం.రవి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 3 కోట్లతో పాటు హైదరాబాద్‌లోని ఫ్లాట్, విశాఖపట్నంలోని ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. అయితే, అతనికి త్వరలోనే బెయిల్ లభించే అవకాశం ఉందని పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది.
Latest News