|
|
by Suryaa Desk | Mon, Nov 24, 2025, 05:32 PM
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంపై దర్శకుడు మారుతి స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆయన క్షమాపణలు తెలిపారు. ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని, తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే చింతిస్తున్నానని పేర్కొన్నారు.హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో ఆదివారం సాయంత్రం ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా తర్వాత కాలర్ ఎగరేసుకుంటారు లాంటి మాటలు నేను చెప్పను. ప్రభాస్ లాంటి కటౌట్‌కు అవి చాలా చిన్న మాటలు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ‘కాలర్ ఎగరేయడం’ అనే పదం తమ హీరోకు చెందిందని భావించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో సోషల్ మీడియాలో మారుతిపై ట్రోలింగ్ మొదలైంది.ఈ వ్యవహారం ప్రభాస్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారితీయడంతో మారుతి వివరణ ఇచ్చారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. "ఎన్టీఆర్ గారి ప్రతి అభిమానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. కొన్నిసార్లు ఉత్సాహంలో మాట్లాడినప్పుడు మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నా వ్యాఖ్యలు మిమ్మల్ని బాధపెట్టినందుకు చింతిస్తున్నాను" అని పేర్కొన్నారు.
Latest News