|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 02:12 PM
ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో రానున్న చిత్రంపై నెలకొన్న సందిగ్ధత వీడింది. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి (తలైవా 173) దర్శకుడు ఖరారైనట్లు కోలీవుడ్ వర్గాల్లో విశ్వసనీయంగా తెలుస్తోంది. 'పార్కింగ్' చిత్రంతో గుర్తింపు పొందిన యువ దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్‌కు ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించే అవకాశం లభించినట్లు సమాచారం.గత కొంతకాలంగా ఈ సినిమాకు దర్శకుడిని ఎంపిక చేసే విషయంలో విస్తృత చర్చలు జరిగాయి. తొలుత లోకేశ్ కనగరాజ్ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ, ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు సి. సుందర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే, ఆయన వినిపించిన హారర్ కథ రజనీకాంత్‌కు నచ్చకపోవడంతో, ఆ ప్రయత్నం విరమించుకున్నారు. దీంతో తలైవా చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.తాజాగా దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ వినిపించిన కాలేజ్ బ్యాక్‌డ్రాప్ కథ రజనీకాంత్‌తో పాటు నిర్మాత కమల్ హాసన్‌ను కూడా విశేషంగా ఆకట్టుకోవడంతో వెంటనే ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగితే, వచ్చే ఏడాది మార్చి నుండి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Latest News