|
|
by Suryaa Desk | Mon, Nov 24, 2025, 05:31 PM
'ఐబొమ్మ' వెబ్‌సైట్ సృష్టికర్త రవి తండ్రి అప్పారావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కొడుకు చర్యలను చట్టపరంగా తప్పుబడుతూనే, అతని వెనుక ఉన్న ఆకలి కేకలను, సినీ పరిశ్రమలోని లోపాలను, తన కుటుంబంలోని కలహాలను భావోద్వేగంతో బయటపెట్టారు.సినీ నిర్మాత సి. కళ్యాణ్ తన కొడుకును ఉద్దేశించి "వాడిని కాల్చేయండి" అన్నారని ఆరోపిస్తూ అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా కొడుకుని కాల్చమంటున్నారు, ఆ నొప్పి ఏంటో తెలియట్లేదు. అదే ఆయన కొడుకుని కాలిస్తే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. వందల, వేల కోట్లు మింగేయడానికి నా కొడుకు అడ్డు వచ్చాడనే వాళ్లకు అంత కోపం. నా కొడుకును అన్నాడు కాబట్టే నేను కల్యాణ్‌ను అంటున్నాను, అంతేకానీ ఆయనపై నాకు వ్యక్తిగత పగ లేదు" అంటూ ఓ తండ్రిగా తన ఆవేదనను వెళ్లగక్కారు.తన కొడుకు రవి ఈ స్థాయికి రావడానికి, ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఆకలి, పేదరికమేనని అప్పారావు కన్నీటిపర్యంతమయ్యారు. "వాడు ఆకలిలోంచి పుట్టాడు. ఇంట్లో సమస్యల వల్ల నేను, నా భార్య విడిపోయాం. వాడు ఒంటరివాడయ్యాడు. ఇంట్లో అన్నం లేక పస్తులున్నాడు. హైదరాబాద్‌లో కూడా పస్తులుండి ఆకలితోనే పని నేర్చుకున్నాడు. ఆ పట్టుదల పస్తుల్లోంచే వచ్చింది" అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు చేసింది తప్పే అయినా, ఈ రోజు కోట్లాది మంది సామాన్యులు అతనికి మద్దతుగా నిలవడం చూస్తున్నామని, కానీ ఆ పేరు, ప్రఖ్యాతులు తనకు వద్దని, తన కొడుకు ఇంట్లో ఉంటే చాలని అన్నారు.
Latest News