|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 02:09 PM
సినీ పరిశ్రమలో కొన్ని నెలలుగా చర్చనీయాంశమైన '8 గంటల పని' వివాదంపై ప్రముఖ నటి కీర్తి సురేశ్ స్పందించారు. తన కొత్త చిత్రం 'రివాల్వర్ రీటా' ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటి దీపిక పదుకొణె ప్రారంభించిన ఈ చర్చపై కీర్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.పనివేళల గురించి మాట్లాడుతూ.. "నేను 9 నుంచి 6 గంటలైనా, 9 నుంచి 9 గంటలైనా పనిచేయగలను. అదొక సమస్య కాదు. కానీ ఉదయం 9 గంటలకు సెట్‌లో ఉండాలంటే, నటీనటులు తెల్లవారుజామున 5 గంటలకే లేవాలి. మేకప్ పూర్తి చేసుకుని 7:30 కల్లా లొకేషన్‌కు చేరుకోవాలి" అని వివరించారు. షూటింగ్ పూర్తయ్యాక ఇంటికి చేరేసరికి చాలా ఆలస్యమవుతుందని, దీంతో విశ్రాంతికి సమయం సరిపోదని అన్నారు. "మనిషికి నిద్ర చాలా ముఖ్యం. కానీ మాకు 8 గంటల నిద్ర ఎక్కడుంది?" అని ఆమె ప్రశ్నించారు.అయితే, అవసరమైతే తాను ఎన్ని గంటల పాటైనా నటిస్తానని చెబుతూనే, నటీనటుల కంటే టెక్నీషియన్ల పరిస్థితి మరింత కష్టంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. "మా కంటే వాళ్లు ఎక్కువ సమయం సెట్‌లో ఉంటారు, వారికి కేవలం రెండు, మూడు గంటల నిద్రే దొరుకుతుంది" అని అన్నారు. తెలుగు, తమిళ పరిశ్రమల్లో 8 గంటల పని విధానం ఉందని, కానీ మలయాళం, హిందీ పరిశ్రమల్లో 12 గంటల కాల్షీట్ ఉంటుందని పేర్కొన్నారు.
Latest News