|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 03:50 PM
ఈ మధ్య కాలంలో వివిధ భాషలలోకి కొరియన్ కంటెంట్ దిగిపోతోంది. అలా లేటెస్ట్ గా ఓటీటీకి వచ్చిన కొరియన్ సినిమానే 'డార్క్ నన్స్'. వాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జనవరి 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. ప్రస్తుతం 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకూ భయపెట్టిందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: సిస్టర్ జునియా .. సిస్టర్ మైకలా నన్స్ గా ఉంటారు. చర్చ్ నేపథ్యంలో వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. జునియాకి ఆత్మలు కనిపిస్తాయి. ఆత్మలతో మాట్లాడే శక్తి ఆమెకి ఉంటుంది. అందువలన ఎవరినైనా ప్రేతాత్మలు ఆవహిస్తే, వాటిని హెచ్చరించి పంపించేస్తూ ఉంటుంది. అయితే కొంతకాలంగా ఆమె కేన్సర్ తో పోరాడుతూ ఉంటుంది. ఇక మైకలాకు కూడా ఆత్మల విషయంలో అవగాహన ఉంటుంది. అందువలన వారి మధ్య స్నేహం కుదురుతుంది. జునియా ఎలాంటి పరిస్థితులలో ఉందనేది మైకలాకు తెలుసు. కాకపోతే ఆమె చర్చి ఫాదర్ 'పాలో'కి భయపడుతూ ఉంటుంది. అందుకు కారణం అతను దెయ్యాలను నమ్మకపోవడమే. మానసికపరమైన రుగ్మతలతో బాధపడేవారిని ఒక డాక్టర్ గా .. ఫాదర్ గా బయటపడేయడానికే తాను ప్రయత్నిస్తానని అతను అంటాడు. దుష్టశక్తుల పేరుతో పక్కదారి పట్టించడానికి తాను ఎంతమాత్రం ఒప్పుకోనని అతను తేల్చి చెబుతాడు.ఈ నేపథ్యంలోనే 'హీ జూన్' అనే ఒక కుర్రాడిని దెయ్యం ఆవహిస్తుంది. ఆ ప్రేతాత్మను వదిలించడానికి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే ఆ కుర్రాడి తల్లి చర్చి హాస్పిటల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఆ కుర్రాడిని ఆవహించినది చాలా మొండి దెయ్యమని గ్రహించిన జునియా, మైకలా సాయంతో ఆ దెయ్యాన్ని వదిలించడానికి రంగంలోకి దిగుతుంది. ఫలితంగా ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? ఆ ప్రేతాత్మ ఎవరిది? దాని ఉద్దేశం ఏమిటి? అనేదే కథ.
Latest News