|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 04:06 PM
ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, శనివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో టైటిల్ తో పాటు ఒక ప్రమోషనల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, సినిమా విశేషాలతో పాటు మహేశ్ బాబు వ్యక్తిత్వం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో మహేశ్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని మార్చి నెలలోనే నిర్వహించాలని భావించినా, వర్షాకాలం కారణంగా వాయిదా పడుతూ వచ్చిందని, ఎట్టకేలకు ఇప్పుడు అభిమానుల ముందుకు వచ్చామని రాజమౌళి తెలిపారు.ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. మహేశ్ బాబు వ్యక్తిత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. "నేను ఇప్పుడు సినిమా గురించి, మహేశ్ పాత్ర గురించి మాట్లాడను. ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతాను. మనందరం సెల్‌ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. కానీ మహేశ్ బాబు సెట్‌లోకి అడుగుపెట్టే ముందు తన ఫోన్‌ను కారులోనే వదిలేసి వస్తారు. ఏడెనిమిది గంటలైనా దాని వైపు కన్నెత్తి చూడరు. ఈ క్రమశిక్షణ ఆయన నుంచి మనమందరం నేర్చుకోవాలి. నేను కూడా ఆయనలా ఉండటానికి ప్రయత్నిస్తాను" అని అన్నారు.ఇక సినిమాలో మహేశ్ పాత్ర గురించి చెబుతూ.. "ఈ సినిమా కోసం మహేశ్‌కు రాముడి గెటప్‌లో ఫొటోషూట్ చేశాం. ఆ ఫొటోను నా ఫోన్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్నా. కానీ, ఎవరైనా చూసి లీక్ చేస్తారేమోనన్న భయంతో తీసేశాను. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించి 60 రోజుల షూటింగ్ కూడా పూర్తి చేశాం. రాముడి పాత్రలో నవ రసాలు పలికిస్తూ మహేశ్ అద్భుతంగా నటిస్తున్నారు. ఓ కొత్త మహేశ్‌ను మీరు చూస్తారు" అని రాజమౌళి సినిమాపై ఉత్కంఠను మరింత పెంచారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన రాచకొండ కమిషనర్ మరియు పోలీసు సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Latest News