|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 04:49 PM
బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ 'రంగీలా' మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఊర్మిళా మదోండ్కర్, ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం శుక్రవారం తిరిగి విడుదలైంది. ఈ సందర్భంగా నటి ఊర్మిళ తన ఆనందాన్ని పంచుకుంటూ, ఒక మంచి కథ ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఈ సినిమా మరోసారి నిరూపించిందని అన్నారు.రంగీలా అనగానే కేవలం జ్ఞాపకాలే కాదని, ఆనందం, ఉత్సాహం, థ్రిల్ అన్నీ ఒక్కసారిగా మదిలో మెదులుతాయని పేర్కొన్నారు. ఆ సినిమాలోని పాత్రలు సామాన్య ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యాయని, అందుకే ఇప్పటికీ ఎయిర్‌పోర్టులో కూడా కొందరు తనను ఆ సినిమాలోని తన పాత్ర పేరుతో 'మిలి' అని పిలుస్తుంటారని తెలిపారు. ఈ చిత్రం ఒక సామాన్య యువతి కలల కథ అని, అందుకే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆనాటి రోజులను గుర్తుచేసుకుంటూ.. అప్పట్లో బాలీవుడ్ మొత్తం స్విట్జర్లాండ్‌లో పాటల చిత్రీకరణపై మోజు పెంచుకుందని, కానీ రంగీలా చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్‌తో తీశామని, ఒక్క పాట మినహా సినిమా మొత్తం ముంబైలోనే చిత్రీకరించారని గుర్తుచేసుకున్నారు. బలమైన కథ ఉంటే ఖరీదైన లొకేషన్లు, భారీ బడ్జెట్‌లు అవసరం లేదని ఈ సినిమా నిరూపించిందని ఊర్మిళ వివరించారు.
Latest News