|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 02:39 PM
నటుడు, లెజెండ్ ధర్మేంద్ర (89) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్తతో భారత చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. యాదృచ్ఛికంగా ఆయన మరణించిన రోజే, ఆయన నటించిన చివరి చిత్రం ‘ఇక్కిస్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇది అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్ర, ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే కుమారుడు బాబీ డియోల్ ఇంటికి తిరిగి వచ్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషాద సమయంలోనే ఆయన చివరి సినిమా పోస్టర్ విడుదల కావడం అందరినీ కదిలించింది.‘ఇక్కిస్’ చిత్రం 1971 భారత్-పాక్ యుద్ధ హీరో, పరమవీర చక్ర గ్రహీత సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో అరుణ్ ఖేత్రపాల్ తండ్రి, బ్రిగేడియర్ ఎం.ఎల్. ఖేత్రపాల్ పాత్రలో ధర్మేంద్ర నటించారు. అరుణ్ పాత్రను అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా పోషిస్తున్నారు. విడుదలైన పోస్టర్‌లో, “ఇది నా పెద్ద కొడుకు అరుణ్... ఇది ఎల్లప్పుడూ అతనిదే” అంటూ ధర్మేంద్ర చెప్పిన డైలాగ్ అందరి హృదయాలను బరువెక్కిస్తోంది.ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ చిత్రబృందం, "తండ్రులు కుమారులను పెంచుతారు... కానీ గొప్ప వ్యక్తులు దేశాన్ని నిర్మిస్తారు" అనే క్యాప్షన్ జోడించింది. ధర్మేంద్ర చివరిసారిగా వెండితెరపై కనిపించనున్న ఈ చిత్రం, 2025 డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Latest News