|
|
by Suryaa Desk | Mon, Nov 24, 2025, 05:27 PM
అదితి పోహంకర్ కి ఓటీటీ వైపు నుంచి మంచి క్రేజ్ ఉంది. ఇంతకు ముందు ఆమె నుంచి వచ్చిన వెబ్ సిరీస్ లు ఆమె అభిమానుల సంఖ్యను పెంచుతూ వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆమె నుంచి ఇప్పుడు మరో వెబ్ సిరీస్ వచ్చింది. ఆ సిరీస్ పేరే 'జిద్దీ ఇష్క్ '. రాజ్ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా .. 7 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సిరీస్ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: మెహుల్ (అదితి పోహంకర్) ఓ మిగిలి క్లాస్ అమ్మాయి. తల్లి .. తండ్రి .. తమ్ముడు 'నీల్' .. ఇదే ఆమె కుటుంబం. కోల్ కతాలోని ఓ ఇంట్లో వారు నివసిస్తూ ఉంటారు. అదే వీధిలో శేఖర్ (పరమబ్రత ఛటర్జీ) తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతను సిద్ధార్థ్ రాయ్ కి చెందిన ఒక పెద్ద సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ రాయ్ శ్రీమంతుడు. అతనికి గల డబ్బు .. పరపతి కారణంగా అందరూ భయపడుతూ ఉంటారు. అతను విలాస పురుషుడని అంతా చెప్పుకుంటూ ఉంటారు. 'రాకా' అనే వ్యక్తి అతనికి రక్షణగా అనుక్షణం పక్కనే ఉంటూ ఉంటాడు. పక్కనే పక్కనే ఇళ్లు ఉన్న కారణంగా శేఖర్ - మెహుల్ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. శేఖర్ వ్యక్తిత్త్వం నచ్చిన కారణంగా, మెహుల్ అతనిని ప్రేమిస్తుంది .. పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ఒక రోజున శేఖర్ ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకుని వెళతారు. ఆ తరువాత అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఊహించని ఈ సంఘటనకు మెహుల్ నివ్వెరపోతుంది. శేఖర్ తల్లి బాధ్యతను కూడా ఆమెనే తీసుకుంటుంది. శేఖర్ ఎందుకు చనిపోయాడు? అనే ఒక సందేహం మెహుల్ ను వెంటాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ రాయ్ సంస్థ నుంచి వచ్చి, మెహుల్ పనిచేస్తున్న సంస్థలో 'మౌసమి' చేరుతుంది. గతంలో ఆమె సిద్ధార్థ్ రాయ్ కి సంబంధించిన సంస్థలో, శేఖర్ తో కలిసి పనిచేయడాన్ని మెహుల్ గుర్తుచేసుకుంటుంది. శేఖర్ ఆత్మహత్యకి కారణం ఏమిటని మౌసమిని అడుగుతుంది. శేఖర్ ఎలా చనిపోయాడనేది తెలియాలంటే, గతంలో అతను ప్రేమించిన సయాంతిక ఆచూకీ తెలుకోవాలని మౌసమి చెబుతుంది. అయితే సయాంతికను సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నాడనీ, పెళ్లైన తరువాత నుంచి సయాంతిక ఏమైపోయిందనేది తెలియడం లేదని చెబుతుంది. దాంతో సయాంతిక ఆచూకీ తెలుకోవడం కోసం మెహుల్ రంగంలోకి దిగుతుంది. సయాంతిక ఏమైపోతుంది? శేఖర్ మరణానికి కారకులు ఎవరు? ఈ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మెహుల్ కి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.
Latest News