|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 03:41 PM
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమంది రవి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం సినిమా పైరసీ మాత్రమే కాకుండా 10 దేశాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసి, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ద్వారా వందల కోట్ల రూపాయల మేర అక్రమ దందా నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. కేసు వివరాలను తమకు అందించాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన రవి, తన జీతం సరిపోకపోవడంతో పాటు, భార్య, అత్తమామలు చులకనగా మాట్లాడటంతో సులభంగా డబ్బు సంపాదించాలని పైరసీ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో అంగీకరించాడు. "నేను ఒంటరిని, నన్ను పట్టించుకునేవారు లేరు, ఏం చేసుకుంటారో చేసుకోండి" అంటూ పోలీసులకే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్టు తెలిసింది. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని, కూకట్‌పల్లిలోని నివాసంలో ఉండగా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.పోలీసుల దర్యాప్తు ప్రకారం రవి తన ఆదాయంలో కేవలం 20 శాతం మాత్రమే పైరసీ ద్వారా, మిగిలిన 80 శాతం ఆదాయాన్ని బెట్టింగ్ యాప్‌లకు యూజర్లను మళ్లించడం ద్వారా సంపాదించాడు. ఈ డబ్బును క్రిప్టో కరెన్సీ, హవాలా మార్గాల్లో విదేశీ ఖాతాలకు తరలించినట్లు గుర్తించారు. ఇప్పటికే అతడి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 3.5 కోట్లను స్తంభింపజేశారు. రవి నెట్‌వర్క్‌లో పలువురు విదేశీయులు కూడా ఉన్నారని, వారిపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
Latest News