![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 12:30 PM
పటాన్చెరు : భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 20 కోట్ల రూపాయలతో పటాన్చెరు పట్టణంలో చేపడుతున్న ఆడిటోరియం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని.. ఆధునిక వసతులతో అందరికీ ఉపయోగపడేలా 4000 మంది సీటింగ్ సామర్థ్యంతో ఆడిటోరియం నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఆడిటోరియం పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు.. తెలంగాణ గొప్పతనాన్ని విశ్వవ్యాపితం చేసిన దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుని ఆడిటోరియానికి పెడుతున్నట్టు ఆయన తెలిపారు. అదే విధంగా ఆడిటోరియానికి ఎదురుగా పివి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలకు పీవీ నరసింహారావు గొప్పతనాన్ని తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు, సమీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించుకునేందుకు వీలుగా 6000 స్క్వేర్ ఫీట్స్ సామర్థ్యంతో రెండు అంతస్తుల్లో 2 వేల మంది చొప్పున 4 వేల మంది సీటింగ్ సామర్థ్యంతో.. ఆధునిక సౌండ్ సిస్టం ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని అందంగా తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపారు. ఆడిటోరియం నిర్మాణానికి గతంలో MSN ఫార్మా పరిశ్రమ 8 కోట్ల రూపాయలు, అరబిందో సంస్థ రెండు కోట్ల రూపాయల CSR నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇటీవల జిహెచ్ఎంసి నుండి నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వివిధ పరిశ్రమల సహకారంతో మిగిలిన 6 కోట్ల రూపాయల నిధులు ఆడిటోరియం అభివృద్ధికి కేటాయించనున్నట్లు తెలిపారు. అతి త్వరలో నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఈఈ సురేష్, డిఈ నరేందర్ ఏఈ శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.