|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 04:38 PM
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఏళ్ల తరబడి.. నిద్రాహారాలు మానుకొని.. రేయింబవళ్లు కష్టపడి చదివినా.. ఉద్యోగం వస్తుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. మన కష్టం ఎంతున్నా.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. లేదంటే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి జరిగినట్లుగా మీకు కూడా జరగవచ్చు. పాపం అతగాడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల నుంచి కష్టపడి చదువుతున్నాడు. ఈ క్రమంలో గతేడాది నిర్వహించిన డీఎస్సీలో టీచర్ కొలువు సాధించాడు.
హమ్మయ్యా ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని మురిసిపోయాడు. ఎంతో సంతోషంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఉన్నతాధికారులు అతడికి కాల్ చేసి.. సారీ మీకు పొరపాటున ఉద్యోగం ఇచ్చాం.. తొలగిపొండి అంటూ చావు కబురు చల్లగా చెప్పారు. అధికారులిచ్చిన షాక్ నుంచి కోలుకోలేక.. ఏం చేయాలో పాలుపోక.. బాధతో అతడు ఇంటికే పరిమితం అయ్యాడు. ఆ వివరాలు..
హైదరాబాద్ జియాగూడ వాసికి విద్యాశాఖ ఉన్నతాధికారులు కోలుకోలేని షాకిచ్చారు. వారి నిర్లక్ష్యం అతడి పాలిట శాపమైంది. ఉద్యోగంలో చేరిన 9 నెలల తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులు అతడికి కాల్ చేసి మీకు పొరపాటున జాబ్ ఇచ్చాం అని చెప్పారు. అసలేం జరిగిందంటే.. 2024లో నిర్వహించిన డీఎస్సీలో హిందీ పండిట్ విభాగంలో 35 పోస్టులను భర్తీ చేశారు. ఒక పోస్టుకు బీసీ-డీ కేటగిరిలో 58.30 మార్కులతో 53 ర్యాంకులో ఒక మహిళను.. 52 మార్కులతో 72వ ర్యాంకులో నిలిచిన ఒక పురుషుడిని 1:3 కింద ఎంపిక చేశారు.
అయితే 58.30 మార్కులు సాధించిన మహిళ.. స్థానికత రంగారెడ్డి జిల్లా కిందకు వస్తుందని చెప్పి ఆమెను పక్కకు పెట్టారు. ఆతర్వాత 52 మార్కులు సాధించిన హైదరాబాద్, జియాగూడ వాసికి ఆ హిందీ పండిట్ ఉద్యోగం ఇచ్చారు. ప్రభుత్వ టీచర్ కొలువు వచ్చిందని మురిసిపోయిన ఆ వ్యక్తి.. 9 నెలల క్రితం అనగా.. 2024 అక్టోబర్ 10న ఆసిఫ్‌ఫనగర్ మండలం గోషాకట్ పాఠశాలలో హిందీ పండిట్‌గా చేరారు. గత 9 నెలలుగా ఉద్యోగం చేస్తున్నారు.
అంతా బాగుంది అనుకున్న తరుణంలో హైదరాబాద్ డీఈఓ అధికారులు అతడికి భారీ షాక్ ఇచ్చారు. వారం రోజుల క్రితం అనగా.. జూలై 29న హైదరాబాద్ డీఈఓ ఆఫీసు అధికారులు ఆ హిందీ పండిట్‌కు ఫోన్ చేసి.. ఈ పోస్టుకు అతడితో పాటు అర్హత సాధించడమే కాక.. అధిక మార్కులు సాధించిన మహిళ.. హైదరాబాద్ లోకల్ కిందకే వస్తున్నట్లు తమకు ఆధారాలు చూపారని అతడికి తెలిపారు.
అందుకే హైకోర్టు తీర్పు మేరకు.. సదరు టీచర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నామని.. ఆఫీస్‌కు వచ్చి.. ఆర్డర్ కాపీపై సంతకం చేసి తీసుకెళ్లాలని వెల్లడించారు. ఉన్నతాధికారులిచ్చిన షాక్ నుంచి అతడు ఇంకా బయటకు రాలేదు. ఉద్యోగం వచ్చిందని ఎంతో మురిసిపోతే.. తీరా 9 నెలల తర్వాత ఉన్నతాధికారులు కాల్ చేసి.. జాబ్ నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడాన్ని అతడు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అందుకే డీఈఓ కార్యాలయం నుంచి ఆర్డర్ కాపీ తీసుకోకుండా ఇంటివద్దే ఉంటున్నారు. అధికారుల తప్పిదానికి తనను బలిచేసి, అన్యాయంగా తనను ఉద్యోగం నుంచి తొలగించి.. తన కుటుంబాన్ని రోడ్డుపాలు చేయొద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.