|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:03 PM
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో ఓ పైలట్ ప్రయాణికుడిపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. క్యూ విషయంలో తలెత్తిన వాగ్వివాదం భౌతిక దాడికి దారితీసిందని, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ తనపై దాడి చేశాడని అంకిత్ దేవాన్ అనే స్పైస్‌జెట్ ప్రయాణికుడు ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌లైన్స్ సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటున్న పైలట్‌ను విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తొలగించింది.బాధితుడు అంకిత్ దేవాన్ కథనం ప్రకారం.. ఆయన తన నాలుగు నెలల చిన్నారి సహా కుటుంబంతో ప్రయాణిస్తున్నారు. పసిపాప ఉండటంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సూచన మేరకు వారు స్టాఫ్/పీఆర్ఎమ్ సెక్యూరిటీ చెక్ లైన్‌లోకి వెళ్లారు. అయితే, అక్కడున్న కొంతమంది సిబ్బంది క్యూను తోసుకుని ముందుకు వెళ్తుండటంతో ఆయన అభ్యంతరం తెలిపారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ కెప్టెన్ వీరేందర్ "నువ్వేమైనా నిరక్షరాస్యుడివా (అన్‌పధ్)? ఇది సిబ్బంది కోసమని రాసి ఉన్న బోర్డు చదవడం రాదా?" అని తనను అవమానించాడని దేవాన్ ఆరోపించారు.ఈ క్రమంలో మాటామాటా పెరిగి పైలట్ తనపై దాడి చేశాడని, ఈ ఘటనలో తనకు గాయాలై రక్తం కూడా వచ్చిందని దేవాన్ తెలిపారు. పైలట్ చొక్కాపై ఉన్న రక్తం కూడా తనదేనని చెబుతూ దాడికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దాడి వల్ల తన కుటుంబంతో కలిసి వెళ్తున్న విహారయాత్ర నాశనమైందని, తన కూతురు తీవ్ర భయాందోళనకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.