|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 07:35 PM
ఓ పాతికేళ్ల క్రితం వరకు కూడా తెలియని ప్రాంతానికి వెళ్లాలనుకుంటే.. ఎవరిని అయినా దారి అడుగుకుంటూ వెళ్లేవాళ్లం. లేదంటే ఆ ఏరియా గురించి బాగా తెలిసిన వారిని తీసుకుని వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశామా.. దాన్ని ఫాలో అవుతూ వెళ్తే సరి. అయితే మనిషి చెప్పినంత కచ్చితంగా ఈ గూగుల్ మ్యాప్ అడ్రస్ చెబుతుందా అంటే.. చాలా వరకు సందర్భాల్లో సరిగ్గానే గమ్యస్థానం చేరుస్తుంది. కానీ కొన్నిసార్లు మాత్రం చిత్ర విచిత్రమైన దారుల్లోకి తీసుకెళ్తుంది. తాజాగా తెలంగాణలో ఓ లారీ డ్రైవర్‌కు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. నదిలోకి వెళ్లబోయిన వ్యక్తి ఆఖరి నిమిషంలో అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్లిన ఓ లారీ డ్రైవర్.. నదిలోకి దూసుకెళ్లాడు. కానీ ఆఖరి నిమిషంలో అప్రమత్తం కావడంతో.. ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో వెలుగు చూసింది. బాషా అనే లారీ డ్రైవర్.. ఆంధ్రప్రదేశ్‌లోని బేతంచర్ల నుంచి తెలంగాణ మక్తల్ పట్టణానికి బండల లోడుతో వస్తున్నాడు.
బాషా అనే వ్యక్తి ఏపీలోని బేతంచర్ల నుంచి తెలంగాణలోని మక్తల్ పట్టణానికి తన లారీలో బండల లోడుతో వస్తున్నాడు. కొత్తకోట మండలం దగ్గరకు వచ్చాక.. జాతీయ రహదారి 44 మీదుగా ఆత్మకూరు నుంచి మక్తల్ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నాడు.
తెల్లవారుజామున కావడంతో రోడ్ల మీద జనాలు కూడా పెద్దగా లేరు. దీంతో దారిని అడిగేందుకు ఎవరూ కనిపించకపోవడంతో.. గూగుల్ మ్యాప్ మీద ఆధారపడ్డాడు. మ్యాప్స్ ఆన్ చేసుకుని ప్రయాణం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆత్మకూరు వద్ద కుడి వైపునకు తిరగాల్సి ఉండగా.. మ్యాప్ ప్రకారం ఎదురుగా వెళ్లాడు. అలా సుమారు మూడు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశాడు. గూగుల్ మ్యాప్ ప్రకారం వెళ్లిన లారీ కాస్త.. లోయర్ జూరాల నది వద్దకు చేరుకుంది.
అప్పటి వరకు మ్యాప్ చూస్తూ ప్రయాణం చేస్తున్న లారీ డ్రైవర్.. ఎదురుగా నీరు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. భయంతో వెంటనే లారీని ఆపేశాడు. దీంతో ఆఖరి నిమిషంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బండలను అన్‌లోడ్ చేసిన తర్వాత లారీని బయటకు తీశారు. ఈ సంఘటన గురించి తెలిసిన వారు మ్యాప్స్‌ను నమ్ముకుంటే మునగాల్సిందే అని కామెంట్ చేస్తున్నారు.