|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 07:31 PM
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణపై వివాదం నెలకొన్న సంగతి తెలిసందే. ఆయన విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. సోమవారం ఆయన విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో నిరసన తెలిపేందుకు తెలంగాణ వాదులు సిద్ధమయ్యారు. దీంతో వారిని పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు కలగకుండా రవీంద్ర భారతితో పాటు.. పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అయితే షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించాల్సి ఉన్నా.. ఆయన ఢిల్లీకి వెళ్లడంతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సోమవారం.. ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
వివాదంపై ఎస్పీ శైలజ స్పందన..
ఎస్పీబాలు విగ్రహావిష్కరణ సందర్భంగా వివాదంపై ఆయన చెల్లి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ స్పందించారు. ఎస్పీ బాలు గాయకులందరికీ స్ఫూర్తిదాయకం అని అన్న శైలజ.. ఒక అన్నయ్యగా తనకు కూడా ఓ కొత్త మార్గాన్ని ఇచ్చారని చెప్పారు. బాలసుబ్రమణ్యం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. బాలు బతికి ఉన్నపుడే.. ఘంటసాల విగ్రహం పక్కన తన విగ్రహవం పెట్టాలని చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ క్రమంలో అన్నయ్య విగ్రహం గురించి నిరసనలు తనకు తెలియదని.. విగ్రహ ఏర్పాటులో తన ప్రమేయం ఏమీ లేదని, మొత్తం సంగీతం బృందం కమిటీ చూసుకుందన్నారు. అంతేకాకుండా బాలు గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరన్నారు.
కాగా, కొన్ని రోజుల క్రితం ఎస్పీ బాలు విగ్రహం ఆవిష్కరణ విషయంపై రవీంద్ర భారతి వద్దకు వచ్చారు బాలు బావమరిది, నటుడు శుభలేఖ సుధాకర్. ఈ సమయంలో ఆయనతో ఉద్యమకారుడు పృథ్విరాజ్‌తో పాటు మరికొంతమంది వాగ్వాదానికి దిగారు. తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి వీలు లేదంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పృథ్విరాజ్‌తో పాటు మరికొందరు తెలంగాణ ఉద్యమ కారులను అక్కడ నుంచి పంపించారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడటానికి నిరాకరించారని.. అందుకే ఎస్పీ బాలు విగ్రహాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ ఏర్పాటు చేయొద్దంటూ తెలంగాణ వాదులు డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి కళాకారులు చాలా మంది ఉన్నారని, వారి విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా తెలంగాణ ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. బాలు విగ్రహం రవీంధ్ర భారతి వద్ద పెట్టడం సరికాదన్నారు. విగ్రహం పెట్టడానికి వేరే స్థలం చూసుకోవాలని చెప్పారు.