|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 08:51 PM
సంక్రాంతి పండుగ సమయంలో రైలు ప్రయాణం అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు పెద్ద సవాలు. హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు అధిక సంఖ్యలో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. ఆ సమయంలో రైలు రిజర్వేషన్ టికెట్స్ దరొకడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక వేళ బుక్ చేసుకున్నా.. వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటం సాధారణంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు ముందస్తుగా కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
సంక్రాంతి ప్రత్యేక రైళ్ల షెడ్యూల్స్ ..
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ముఖ్య ప్రాంతాలకు (విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, విజయవాడ వంటివి) అనుసంధానం చేస్తూ ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్ల షెడ్యూల్ వివరాలను రైల్వే ప్రకటించింది. అందులో ఒకటి.. సికింద్రాబాద్- అనకాపల్లి మధ్య స్పెషల్ (07041/07042) ట్రైన్. రైలు నంబర్ 07041 సికింద్రాబాద్- అనకాపల్లి వరకు.. 2026 జనవరి నెలలో ఆదివారాల్లో అంటే జనవరి 4, 11, 18 తేదీల్లో ఈ రైలు నడుస్తుంది. రైలు నంబర్ 07042 అనకాపల్లి- సికింద్రాబాద్ వరకు.. 2026 జనవరి నెలలో సోమవారాలు అంటే జనవరి 5, 12, 19 తేదీల్లో నడుస్తుంది.
ఇక హైదరాబాద్- గోరఖ్‌పూర్ స్పెషల్ (07075/07076) ట్రైన్ విషయానికి వస్తే.. రైలు నంబర్ 07075 హైదరాబాద్- గోరఖ్‌పూర్ వరకు.. జనవరి నెలలో శుక్రవారాల్లో అంటే జనవరి 9, 16, 23 తేదీల్లో నడుస్తుంది. రైలు నంబర్ 07076 గోరఖ్‌పూర్ – హైదరాబాద్ మధ్య.. జనవరి నెలలో ఆదివారాల్లో అంటే జనవరి 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
మచిలిపట్నం- అజ్మీర్ మధ్య స్పెషల్ (07274/07275) ట్రైన్.. రైలు నంబర్ 07274 మచిలీపట్నం- అజ్మీర్ వరకు.. ఈ రైలు 2025 డిసెంబర్ 21వ తేదీన (ఆదివారం) ప్రయాణిస్తుంది. రైలు నంబర్ 07275 అజ్మీర్-మచిలీపట్నం వరు.. ఈ రైలు 2025 డిసెంబర్ 28వ తేదీన నడుస్తుంది.
ఈ ప్రత్యేక రైళ్లు పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఉదాహరణకు.. సికింద్రాబాద్-అనకాపల్లి రూట్‌లో ఇవి గుడివాడ, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్ వంటి స్టేషన్లలో ఆగుతాయి. అదేవిధంగా.. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక రైళ్లు మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, బాసర్, ధర్మాబాద్, నాందేడ్, పర్భాని, జాల్నా, సంభాజీనగర్, మన్మాడ్, భుసావల్, భోపాల్, ఉజ్జయిని వంటి అనేక కీలక స్టేషన్‌లలో స్టాప్‌లు కలిగి ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.
రైల్వే అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థమే ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. రద్దీని బట్టి భవిష్యత్తులో మరిన్ని రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడతామని కూడా హామీ ఇచ్చారు. పండుగకు ముందుగానే ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్లను రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.