|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:50 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపైనా, బీజేపీపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తే నేతల అవినీతి చిట్టా మొత్తం విప్పుతానని, గుంటనక్కల్లాంటి వారిని వదిలిపెట్టనని తీవ్రంగా హెచ్చరించారు. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్‌తో కలిసి నేను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నానని అంటున్నారు. అలాంటి గుంటనక్కలకు చెబుతున్నా.. నాపై అనవసరంగా దాడి చేస్తే మీ చిట్టా మొత్తం విప్పుతా. ఇది జస్ట్ టాస్ మాత్రమే, అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది" అని కవిత వ్యాఖ్యానించారు. తాను కూడా ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిని అవుతానని, అప్పుడు 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపైనా విచారణ చేయిస్తానని స్పష్టం చేశారు. "ఆడపిల్ల కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారేమో.. ఒక్కొక్కరి తోలు తీస్తా. 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపైనా విచారణ జరిపిస్తా" అంటూ ఘాటుగా హెచ్చరించారు.