|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:31 PM
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం జరిగిన తొలి విడత పోలింగ్ లో పలుచోట్ల ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు, లాటరీ ద్వారా సర్పంచ్ పదవిని దక్కించుకున్న అదృష్టవంతులు, కన్నుమూసినా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి.. ఇలా పలు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరంపల్లిలో ఇరువురు సర్పంచ్ అభ్యర్థులకు సమానంగా 276 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ నిర్వహించినా అదే ఫలితం రావడంతో అధికారులు లాటరీ తీశారు. ఇందులో బీఆర్ఎస్ మద్దతుదారు మైలారం పోచయ్యను సర్పంచ్ పదవి వరించింది.రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చిన్నఎల్కచెర్లలో కూడా ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 212 ఓట్లు వచ్చాయి. దీంతో అభ్యర్థుల సమ్మతితో అధికారులు టాస్ వేయగా.. కాంగ్రెస్ మద్దతుదారు మరాఠి రాజ్ కుమార్ గెలిచాడు.పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని కాకర్లపల్లి గ్రామంలోనూ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు డ్రా తీయాగా బీఆర్ఎస్ కు చెందిన కొమురయ్య గెలుపొందారు.ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుఠానీ తండాలో సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరికీ సమానంగా 264 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ ద్వారా సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించారు. ఇందులో అదృష్టం కాంగ్రెస్ మద్దతుదారు మూడ్ చిన్నాను వరించింది.