|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 07:32 PM
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. 2026 ఏడాది ప్రారంభం నుంచే ఈ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణ మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకోవడానికి గాను ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు చూపించాల్సి వస్తోంది. అయితే త్వరలోనే వీటి స్థానంలో స్మార్ట్ కార్డు తీసుకు రావాలని నిర్ణయించుకుంది.
తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు రెండేళ్లలో 251 కోట్ల ప్రయాణాలు చేశారు. వీటి విలువ దాదాపు రూ.8,500 కోట్లు అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం, తెలగాణలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి తమ వెంట ఆధార్ కార్డును తీసుకెళ్లాలి. ఒకవేళ కార్డు లేకపోతే, టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది. అయితే, ఈ ఇబ్బందులను తొలగించడానికి ఆర్టీసీ యాజమాన్యం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఈ స్మార్ట్ కార్డులను 2026 సంవత్సరం మొదట్లోనే అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాస్తవంగా 2025 ఏడాదిలోనే వీటిని ప్రవేశపెట్టాలని అనుకున్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయింది. ఇప్పుడు కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డుపై లబ్ధిదారుల ఫోటో, పేరు, చిరునామా వంటి వివరాలు ముద్రించి ఉంటాయి.
ఈ కార్డులు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదు. విద్యార్థుల బస్ పాస్‌లను కూడా స్మార్ట్ కార్డుల్లోకి మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం నుంచే హైదరాబాద్‌లో ఈ కార్డులను ప్రయోగాత్మకంగా ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా విస్తరించాలని యోచిస్తున్నారు. రాయితీలతో ప్రయాణం చేసే వారికి కూడా ఈ స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్ కార్డుల వల్ల ప్రయాణం మరింత సులభతరం అవుతుందని ఆర్టీసీ భావిస్తోంది.