|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 07:29 PM
ప్రతి యువ క్రికెటర్ కళ్లలో ఒకే కల ఉంటుంది.. ఏదో ఒక రోజు దేశం తరపున ఆడాలి.. క్రికెట్ దిగ్గజంగా ఎదగాలని. హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఆశలు, లక్ష్యాలు పెట్టుకున్న వందలాది మంది యువ ఆటగాళ్లకు జింఖానా గ్రౌండ్ ఒక ముఖ్యమైన వేదిక. కానీ.. వారి కలలకు తొలి మెట్టు వద్దే నిరాశ ఎదురైంది.
జింఖానాలో అండర్-14 సెలెక్షన్స్ తీరు..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-14 వయసు విభాగపు ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో కనిపించిన దృశ్యాలు నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. వందలాది మంది యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకోవాలని.. ఎంపిక కమిటీ దృష్టిలో పడాలని ఉదయం నుంచే జింఖానా మైదానానికి చేరుకున్నారు. సాధారణంగా.. క్రీడా సంస్థలు ఇలాంటి భారీ ఎంపిక శిబిరాలకు వచ్చిన అభ్యర్థుల కోసం కనీసం నీడ కోసం టెంట్లు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ.. జింఖానా గ్రౌండ్‌లో కనీసం షెల్టర్ కూడా లేకపోవడంతో.. ఆ యువకులు ఎండలో నిలబడి తమ వంతు కోసం పడిగాపులు పడాల్సి వచ్చింది.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత పెరుగుతున్నా.. హెచ్‌సీఏ అధికారులు కనీస వసతులు కల్పించకపోవడం నిర్వాహణ లోపాన్ని స్పష్టం చేస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఆటగాళ్లు, వారి తల్లిదండ్రులు హెచ్‌సీఏ పనితీరుపై నిరాశ వ్యక్తం చేయడం సహజం. కొన్నిసార్లు క్రమశిక్షణ విషయంలో హెచ్‌సీఏపై అంచనాలు ఎప్పుడూ తక్కువగానే ఉంటాయనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. అంతే కాకుండా.. అక్కడనున్న వారిని మైదానం లోపలికి కూడా అనుమతించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో క్రీడాకారుల తల్లిదండ్రులు హెచ్సీఏ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యం ఇదేనా..? వందలాది మంది యువతలో ప్రోత్సాహాన్ని నింపి, వారిని ఉన్నత స్థాయికి చేర్చే బాధ్యత క్రికెట్ అసోసియేషన్‌పై ఉంటుంది. కానీ.. ఎండలో వారికి కనీసం నీడ కూడా కల్పించకపోవడం, క్రీడా స్ఫూర్తిని, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకపోవడమే అవుతుంది. యువతకు అవకాశాలు ఇచ్చేటప్పుడు.. వారి ఉత్సాహాన్ని తగ్గించకుండా.. వారికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం సంస్థ బాధ్యత. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఈ యువ క్రికెటర్ల ఆశలు.. వారు పెట్టుకున్న లక్ష్యాలకు ఈ సంస్థ సరైన మార్గం చూపుతుందా..? అనే సందేహం కలుగుతుంది. క్రికెట్ ప్రపంచంలో తమదైన ముద్ర వేయాలని కలలు కనే ఈ చిన్నారుల కోసం హెచ్‌సీఏ తన పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.