|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 06:25 AM
వినోద రంగం విషయంలో ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా తనవంతు కృషి చేస్తానని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' ముగింపు వేడుకలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సినీ రంగం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల క్రితమే చెప్పారని, ప్రస్తుతం ఈ సదస్సును చూసిన తర్వాత ఆయన అనుకున్నది సాధిస్తారనే నమ్మకం కలిగిందని చిరంజీవి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్ర పరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామని ఆయన తనతో గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. చెప్పిన కొద్ది రోజులకే ఎంతోమంది ప్రముఖులను హైదరాబాద్‌కు తీసుకువచ్చారని ఆయన ముఖ్యమంత్రిని ప్రశంసించారు.తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు తనను ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులను తన వద్దకు పంపించారని ఆయన వెల్లడించారు. అయితే, వారు తనను ఆహ్వానించడానికి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన సమయంలో తాను ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నానని, ఆ సమయంలో తనకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందని ఆయన అన్నారు.