|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:25 PM
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఇండిగో విమానాల రద్దు పరంపర ఆరో రోజూ కొనసాగింది. ఆదివారం ఏకంగా 117 సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వరుసగా విమానాలు రద్దు కావడంతో వేలాది మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.ఎయిర్‌పోర్ట్ అధికారుల వివరాల ప్రకారం, ఆదివారం రద్దయిన విమానాల్లో 61 బయలుదేరేవి , 56 వచ్చేవి ఉన్నాయి. శుక్రవారం (155), శనివారం (144) రద్దులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే అయినప్పటికీ, ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం తగ్గలేదు. డిసెంబర్ 2 నుంచి ఇప్పటివరకు శంషాబాద్ విమానాశ్రయంలో 500కు పైగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి.విమానాల రద్దుతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అదనపు భద్రతను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు, విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా 10 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి.ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పైస్‌జెట్ అదనపు విమానాలను నడుపుతోంది. రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి వంటి నగరాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే కూడా చెన్నై, ముంబై, కోల్‌కతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన అయ్యప్ప భక్తుల కోసం కొచ్చికి కొన్ని ప్రత్యేక విమానాలను నడిపారు.తమ వ్యవస్థను స్థిరీకరించేందుకే కార్యకలాపాలను తగ్గించామని, త్వరలోనే షెడ్యూళ్లను సాధారణ స్థితికి తీసుకొస్తామని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.