|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 07:20 PM
ఖమ్మం జిల్లా సత్తుపల్లి అర్బన్ పార్కులో జరిగిన జింకల వేట కేసులో జిల్లా అటవీ శాఖ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ అమానుష ఘటనకు పాల్పడినట్లుగా గుర్తించిన మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మెచ్చా రఘు ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉండటం తీవ్ర సంచలనం సృష్టించింది. జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటల తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నీలాద్రి అర్బన్ పార్కులో ఈ వేట జరిగింది.
నిందితులు నాటు తుపాకులతో వచ్చి ఐదు జింకలను వేటాడి చంపినట్లుగా గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే బంధువు మెచ్చా రఘు అతని స్నేహితులతో కలిసి అదే ప్రాంతంలో అటవీ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న గోపీకృష్ణ సహకారం తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులు గోపీకృష్ణ సహాయంతో అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మార్చి.. అధికారులను ఏమార్చేందుకు ప్రయత్నించినట్లు డీఎఫ్‌వో తెలిపారు. అయితే.. ఇతర సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించగలిగామని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో మొదటగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు.. తాజాగా మరో ఇద్దరు ప్రధాన నిందితులైన మెచ్చా రఘు , కుంజా భరత్‌ను అరెస్టు చేసి.. రిమాండ్‌కు పంపించారు.
నిందితుల్లో రఘు, భరత్, గోపీకృష్ణ, శ్రీరామ్ ప్రసాద్ అనే వ్యక్తులు ఉన్నారని.. వీరు ఒక ప్రొఫెషనల్ షూటర్‌ను కూడా తీసుకువచ్చినట్లు తెలిసిందని డీఎఫ్‌వో తెలిపారు. ఘటన అనంతరం వివిధ ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్న నిందితులను పట్టుకోవడానికి ఖమ్మం సీపీ, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీల సహకారం తీసుకున్నట్లు డీఎఫ్‌వో పేర్కొన్నారు. ఈ వేటకు సహకరించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. వేట చట్ట రీత్యా నేరం అని ప్రజలకు గట్టిగా హితవు పలికారు. నిజాం, నవాబు కాలంనాటి రోజులు కావివి అని.. రోజులు మారాయని గుర్తు చేశారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వేట కదలికలను పసిగడతామని.. వన్యప్రాణి చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ కేసు ఛేదనలో పాల్గొన్న అటవీ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు.