|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:26 PM
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. చాలా ఏరియాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన శీతల గాలులు వీచడం, కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయన్నారు. చల్లని ప్రభావం ముఖ్యంగా రాత్రి, సాయంత్రం, తెల్లవారుజామన అత్యధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా.. పౌరులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో చల్లటి గాలులు తీవ్రంగా వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. చల్లని పరిస్థితుల కారణంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు సురక్షితంగా ఉండాలని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా తగినంత వెచ్చని దుస్తులు ధరించాలి, రాత్రి వేళల్లో బయట తిరగడం తగ్గించాలని..వృద్ధులు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
చల్లని గాలులు, తక్కువ ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రైతులు, వాహనదారులు, సామాన్య ప్రజలు కూడా అదనపు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఉదయం వేళల్లో రోడ్లపై పొగమంచు ప్రభావం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహనదారులు నెమ్మదిగా అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు చలికి తగిన విధంగా దుస్తులు ధరించి సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే ప్రజలు వేడి ప్రాంతాల్లో నివాసం ఉండటం మంచిదన్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు.