|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:33 PM
తెలంగాణ రాష్ట్ర రహదారుల రంగంలో సరికొత్త శకం మొదలుకానుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను కలిపే కీలకమైన ‘జాతీయ రహదారి 65 ’పై భారీ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రవాణా రంగానికి జీవనాడిగా భావించే హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేను ఏకంగా 8 లైన్ల రహదారిగా విస్తరించడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మెగా ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ. 10,400 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు లైన్లుగా ఉన్న ఈ రహదారిని ఎనిమిది లైన్ల వరకు విస్తరించడం ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక.. ఈ మార్గంలో తరచూ ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతోంది. డీపీఆర్ ఖరారు అయిన వెంటనే.. జాతీయ రహదారుల సంస్థ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు చేయడంతో... సాంకేతిక ఆమోదం లభిస్తుంది. సాంకేతిక అనుమతులు లభించిన వెంటనే.. ప్రాజెక్టును టెండరింగ్ ప్రక్రియ ద్వారా నిర్మాణ సంస్థలకు అప్పగిస్తారు. ఆ తర్వాత.. భూసేకరణ వంటి అంశాలను పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ నూతన ప్రాజెక్టుల నిర్మాణంలో రికార్డులను సృష్టిస్తూ వేగంగా దూసుకుపోతోంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను సైతం హైదరాబాద్‌తో అనుసంధానించాలనే లక్ష్యంతో కొత్త జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల నిర్మాణాలను, ఉన్న రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేస్తున్నారు. హైదరాబాద్ - విజయవాడ కారిడార్ విస్తరణతో ఈ మార్గంలో పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్‌లు మరియు ఇతర వ్యాపార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుంది.
ఈ ఎనిమిది లైన్ల రహదారి వలన హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రయాణించే ప్యాసింజర్ వాహనదారులు, అలాగే వస్తు రవాణా చేసే లారీలు వేగంగా.. సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతారు. తద్వారా.. ఇరు రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి.