|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 07:49 PM
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. శీతాకాలంలో పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రపంచంలోకెల్లా అత్యంత దారుణమైన వాయు నాణ్యత కలిగిన నగరంగా ఢిల్లీ ఉంది. పరిస్థితి చేజారాక ఎన్ని ప్రయాత్నాలు చేసినా ఫలితాలు రావడం లేదు. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించి, కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా వాయు నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టంగానే మారుతోందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ).. ఒక్క రోజు కూడా నాణ్యమైన గాలి (గుడ్ ఎయిర్) లేదని నివేదికలు చెబుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో డిసెంబరు నెల వాయు కాలుష్యం (ఏక్యూఐ) పరిశీలిస్తే.. ఈ ఏడాది డిసెంబర్‌లో అత్యధిక స్థాయిలో నమోదు అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం ఏక్యూఐ 50 లోపు ఉంటే స్వచ్ఛమైన గాలిగా పేర్కొంటారు. అయితే హైదరాబాద్‌లో 2025 జనవరి నుంచి గడచిన 337 రోజుల్లో.. 203 రోజులు సాధారణ స్థాయిలో ఉండగా.. 110 రోజులు పూర్ ఏక్యూఐ నమోదు అయింది. ఇక 23 రోజులు అన్‌హెల్తీగా గాలి నాణ్యతను పేర్కొన్నారు. 2022 నుంచి డిసెంబరు నెల వాయు నాణ్యత సూచీ పరిశీలిస్తే.. ఈ ఏడాది 185గా ఉంది.
హైదరాబాద్‌లోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో బుధవారం ఏక్యూఐ 253గా నమోదు అయింది. అదే సమయంలో అమీన్‌పూర్‌లో 201గా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూడా ఢిల్లీ వైపు అడుగులు వేస్తోందని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి హైదరాబాద్‌లో వాయు నాణ్యత మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
హైదరాబాద్‌లో గాలి నాణ్యత తగ్గడానికి కారణాలివే..
దుమ్ము గాలిలోకి లేవడం.. హైదరాబాద్‌లో గాలి నాణ్యత పడిపోవడానికి ప్రధాన కారణం. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో అధికంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో నిర్మాణ ప్రదేశాలలో మట్టిని తవ్వడం, భవనాలు కూల్చడం, సిమెంట్, ఇసుక తరలించడం వంటి కారణాలతో ధూళి కణాలు పైకి లేస్తున్నాయి. దీంతో పాటు రోడ్లపై ఎక్కడికక్కడే మట్టి పేరుకుపోయి ఉండటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. వాహనం వెళ్లిన ప్రతిసారి ధూళి కణాలు గాల్లోకి లేస్తున్నాయి.
వీటికి తోడు భారీ పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఉద్గారాల వల్ల వాయు నాణ్యత పడిపోతోంది. అయితే వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం సరైన విధానాలు అనుసరించడం లేదనే వాదన ఉంది. వాయు కాలుష్యాన్ని ఒక నగరానికి పరిమితం చేసి చర్యలు చేపట్టడం సరికాదని.. ఒక ప్రాంతం మొత్తంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఢిల్లీలా పరిస్థితి చేజారకముందే ప్రభుత్వం మేల్కొని కాలుష్య కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.