|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:47 PM
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహంలో కలుషిత ఆహారం తిని సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం సృష్టించింది. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటన ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం వారికి అల్పాహారంగా ఉప్మా అందించారు. ఆ ఉప్మాలో పురుగులు వచ్చాయని విద్యార్థులు గుర్తించి వెంటనే ఆ విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు తెలిపారు. వార్డెన్ ఉప్మాను పారవేయించినప్పటికీ.. విద్యార్థులు ఆ తర్వాత అరటిపళ్లు, బిస్కెట్లు తిని యథావిధిగా పాఠశాలకు వెళ్లారు. అయితే, పాఠశాలకు వెళ్లిన అరగంట తర్వాత విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. దీంతో వెంటనే పాఠశాల సిబ్బంది స్పందించి అస్వస్థతకు గురైన విద్యార్థులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండవచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఈ ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో నిత్యం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు కూడా ఆవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు. ఇన్ని జరుగుతున్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని.. తీరు మార్చుకోవటం లేదని ఫైర్ అయ్యారు. గద్వాల ఎస్టీ సంక్షేమ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందని కవిత విమర్శించారు. విద్యాశాఖ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నప్పటికీ.. ఆయన ఇలాకాలోనే వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటని కవిత ఆక్షేపించారు.