|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:26 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సుకు వారిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలవనున్నారు.ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఒక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఈ కమిటీ కార్యకలాపాలను సమన్వయం చేస్తారు. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన 4,500 మందికి ఆహ్వానాలు పంపగా, 1,000 మంది తమ రాకను ధ్రువీకరించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.ఈ సదస్సులో ‘తెలంగాణ రైజింగ్ 2047’ పేరుతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. గడిచిన అనుభవాలను పాఠాలుగా తీసుకుని, భవిష్యత్ తరాల కోసం ఈ దార్శనిక పత్రాన్ని సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.