|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:16 PM
ఉచిత పథకాల సంస్కృతిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత హామీలు ఎన్నికల్లో గెలిపించవచ్చేమో గానీ, దేశాన్ని మాత్రం నిర్మించలేవని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు ‘రేవ్‌డీ కల్చర్’ (ఉచితాల సంస్కృతి)ని తీవ్రంగా విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇప్పుడు ఎన్నికల లాభాల కోసం అవే హామీలు ఇస్తున్నారని సుబ్బారావు ఎద్దేవా చేశారు. ఇది ఏదో ఒక పార్టీ వైఫల్యం కాదని, మొత్తం రాజకీయ వ్యవస్థలోనే పాతుకుపోయిన సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. హామీలు నమ్మశక్యంగా లేనప్పుడు ప్రజలు వాటిని విశ్వసించడం మానేస్తారని పేర్కొన్నారు.ప్రతి ఉచిత పథకం ఒక రాజకీయ వైఫల్యానికి అంగీకారమేనని ఆయన వ్యాఖ్యానించారు. "ప్రజలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించలేకపోతున్నాం, అందుకే ఈ తాయిలాలతో సర్దుకుపోవాలి" అని నేతలు చెప్పడమే దీని అర్థమని వివరించారు. దేశంలో ఉద్యోగాల కల్పన, ఉత్పాదకత పెంపు వంటి కీలక అంశాలపై చర్చ జరగడం లేదని, వాటి స్థానంలో నగదు బదిలీ హామీలపై చర్చ జరుగుతోందని విశ్లేషించారు.