|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:24 PM
పశ్చిమ బెంగాల్ లోని నబద్వీప్ పట్టణంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును తల్లి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లగా.. వీధికుక్కలు ఆ బిడ్డకు రక్షణగా రాత్రంతా కాపలా కాశాయి. బిడ్డ చుట్టూ రక్షణ కవచంలా నిలుచున్నాయి. ఆ పసికందు సమీపంలోకి మనుషులను కాదుకదా పురుగును కూడా రానివ్వలేదు. పూర్తిగా తెల్లవారిన తర్వాత స్థానిక మహిళ ఒకరు బిడ్డ దగ్గరికి వెళ్లగా.. ఇక తమ బాధ్యత పూర్తయిందన్నట్టు ఆ శునకాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ సంఘటన స్థానికుల్లో తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే..నదియా జిల్లాలోని నబద్వీప్ పట్టణం రైల్వే వర్కర్ల కాలనీలో పబ్లిక్ టాయిలెట్ ముందు అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది. బిడ్డపై రక్తపు మరకలు కూడా పోలేదు. పుట్టిన వెంటనే ఆ బిడ్డను తల్లి వదిలేసి వెళ్లింది. రోడ్డుపై ఆ బిడ్డను గమనించిన వీధి కుక్కలు అక్కడికి చేరుకున్నాయి. వాటి సహజ ప్రవర్తనకు భిన్నంగా ఆ బిడ్డ చుట్టూ రక్షణ వలయంగా నిలుచున్నాయి. మొరిగితే ఆ బిడ్డకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అన్నట్లు నిశ్శబ్దంగా కాపలా కాశాయి.సుశిక్షితులైన బాడీగార్డుల్లాగా రాత్రంతా కాపలా కాసిన ఆ శునకాలు.. చిన్న పురుగును కూడా బిడ్డ సమీపంలోకి రానివ్వలేదు. పూర్తిగా తెల్లవారాక వీధి కుక్కల మధ్య పసికందును గమనించి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ మహిళ ధైర్యంచేసి బిడ్డ దగ్గరకు వెళ్లగా.. మా డ్యూటీ పూర్తయింది, ఇకపై ఆ బిడ్డ రక్షణ నీదే అన్నట్లు శునకాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కనీసం దుప్పటి కూడా లేకుండా రాత్రంతా చలిలో ఉన్న ఆ బిడ్డను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ పసికందు ఆరోగ్యంగా ఉందని నబద్వీప్ పట్టణ చైల్డ్ హెల్ప్ అధికారులు పేర్కొన్నారు.