|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:27 PM
తెలంగాణ భవిష్యత్తు కోసం పటిష్టమైన ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ‘విజన్ డాక్యుమెంట్ 2047’ వివరాలను వెల్లడించారు. రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు ఈ విజన్ డాక్యుమెంట్‌ను తయారు చేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పారదర్శక విధానాలు అవసరమని, పాలసీలకు పెరాలసిస్ వస్తే పెట్టుబడులకు రక్షణ ఉండదని అన్నారు. ఐఎస్‌బీ, నీతి ఆయోగ్ వంటి సంస్థల సహకారంతో పాటు లక్షలాది మంది ప్రజల భాగస్వామ్యంతో ఈ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్లు వివరించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ 5 శాతం వాటాను అందిస్తోందని, దీనిని 10 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు సీఎం చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో కొత్తగా నాలుగు విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్-మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం నుంచి అంగీకారం కుదిరిందని తెలిపారు. హైవేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆదాయం పెంచి, పేదలకు పంచే విధానంతో ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అద్భుత పాలసీని జాతికి అంకితం చేస్తున్నామని ప్రకటించారు.