|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 09:14 PM
ప్రభుత్వ స్థలాలను, జలాశయాలను, పచ్చని ప్రాంతాలను అక్రమార్కుల నుంచి కాపాడేందుకు ఏర్పడిన నగర అభివృద్ధి హైడ్రా తీసుకుంటున్న చర్యలు కొంతమందికి ఇబ్బందిగా మారినా.. మరికొంతమందికి మాత్రం వరంగా మారాయి. మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా, నిజాంపేట కార్పొరేషన్, బాచుపల్లి ప్రాంతంలోని పిల్లలు తమకు ఆడుకునే స్థలాలు దొరికాయనే సంతోషంతో హైడ్రాకు ముద్దుముద్దు మాటలతో జిందాబాద్ నినాదాలు చేయడం.. మనుషుల సంక్షేమం కోసం ఏర్పడిన ఈ సంస్థ విలువను తెలియజేస్తోంది.
నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, కాకతీయ కాలనీలలో ఉన్న రెండు పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి హైడ్రా అధికారులు రక్షించారు. కాకతీయ కాలనీలో దాదాపు 600 గజాలు, 1500 గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు విలువైన పార్కు స్థలాలను అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల నుంచి హైడ్రా కాపాడింది. ఈ పార్కులు తమకు తిరిగి దక్కినందుకు సంతోషించిన వందలాది మంది చిన్నారులు హైడ్రాకు మద్దతు తెలుపుతూ ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ‘మాకు ఆడుకునే స్థలం దొరికింది, ప్రాణవాయువును అందించే పార్కు స్థలాన్ని కాపాడారు అంటూ నినాదాలు చేశారు.
హైడ్రా ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం ఎవరినీ బాధ పెట్టడానికి కాదు.. ప్రజల సంక్షేమాన్ని కాపాడటానికే అని ఈ ఘటన నిరూపించింది. ప్రభుత్వ స్థలాలను, చెరువులను, నాలాలను, పార్కులను కబ్జా కొరల్లో నుంచి విముక్తి కల్పించి.. వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే హైడ్రా లక్ష్యం. ఈ సందర్భంగా అక్రమంగా స్థలాలను ఆక్రమించుకున్న కొందరు.. తాము ప్రభుత్వ స్థలాలని తెలియక తీసుకున్నామని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ.. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రక్షించబడిన పార్కులలో తాము మొక్కలు నాటి.. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటామని చిన్నారులు నినదించారు. ఇది రేపటి పౌరులలో పర్యావరణ బాధ్యతను పెంపొందించడానికి హైడ్రా చర్యలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు. సామాన్య ప్రజల భద్రత, ఆరోగ్యం, జీవన నాణ్యత మెరుగుదల కోసం హైడ్రా నిరంతరం పనిచేస్తుందని.. కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతూనే ఉంటుందని అధికారులు తెలియజేశారు.