|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:34 PM
ఢిల్లీలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి తీవ్ర ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. చాలా ఏళ్లుగా బోర్‌వెల్స్, ట్యూబ్‌వెల్స్ నీటిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మందికి తాజా నివేదిక దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది. కేంద్ర భూగర్భ జల మండలి (CGWB) 2025 తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం, ఢిల్లీలోని భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయిలో యురేనియం ఉన్నట్లు తేలింది. సేకరించిన నమూనాలలో దాదాపు 13 నుంచి 15 శాతం నీటిలో యురేనియం పరిమితికి మించి ఉందని నివేదిక స్పష్టం చేసింది. యురేనియంతో పాటు నైట్రేట్, ఫ్లోరైడ్, సీసం (లెడ్) వంటి ఇతర విష రసాయనాలు కూడా అధిక మోతాదులో ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. దేశంలోనే అత్యధికంగా 9.3 శాతం నీటి నమూనాల్లో సీసం ఉన్న ప్రాంతంగా ఢిల్లీ నిలవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వ్యవసాయంలో వాడే ఎరువులు, శుద్ధి చేయని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు భూమిలోకి ఇంకడం వల్లే నైట్రేట్, సీసం వంటివి నీటిలో కలుస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ కలుషిత నీటిని దీర్ఘకాలం పాటు తాగడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఎముకల బలహీనత, చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదల లోపాలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.