|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 03:24 PM
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ తరపున యువజన కాంగ్రెస్ నాయకుడు కటికి కిరణ్ కుమార్ అధికారిక అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. యువతలో ఆదరణ పొందిన నాయకుడిగా పేరొందిన కిరణ్ కుమార్ ఈ ఎన్నికల్లో విజయం సాధించి గ్రామాభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ 4వ తేదీన కిరణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీతో నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. గ్రామంలోని యువకులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ జెండాను ఎగురవేయనున్నారు.
కాంగ్రెస్ నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, మల్లవరం గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే బాధ్యత కిరణ్ కుమార్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గ్రామంలో ఆయన చురుకైన కార్యకలాపాలు, సమస్యల పరిష్కారంలో చూపిన చొరవ ప్రజలను ఆకట్టుకుంటోంది.
ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, యువత భారీ సంఖ్యలో తరలి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపాలని పార్టీ నాయకులు పిలుపుణిచ్చారు. మల్లవరం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తుందన్న నమ్మకం కార్యకర్తల్లో కనిపిస్తోంది.