|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 08:08 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడిన తర్వాత అదిలాబాద్ వేదికగా ప్రకటన చేస్తున్నానని, సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్‌లో విమానాశ్రయ పనులను ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో రూ.260 కోట్లతో అభివద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, తాను రెండేళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని అన్నారు.విపక్ష నేతలను కలుపుకుని తాము ముందుకు పోతున్నామని ఆయన అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి విపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు తాము ప్రతిపక్షాలతో కలిసి ముందుకు సాగుతున్నామని అన్నారు.తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించానని, దేశంలోని ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకుని ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. తాను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కావొచ్చు.. కానీ కేంద్రం సహకారంతో ముందుకు సాగాలని, అందుకే మోదీతో మాట్లాడిన తర్వాత విమానాశ్రయంపై ప్రకటన చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.ఎర్రబస్సు కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్సు తీసుకు వచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి అన్నారు. రాబోయే రెండు నెలల్లో అభివృద్ధి ప్రణాళికతో మళ్లీ వస్తానని, అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆదిలాబాద్‌ను ఆదర్శ జిల్లాగా చేస్తానని అన్నారు.కన్నతల్లితో సమానమైన సోనియా గాంధీ ఆశీర్వాదం తీసుకుని తాను ఇక్కడకు వచ్చానని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో సున్నపు గనులు ఉన్నాయని, కాబట్టి ఇక్కడకు పరిశ్రమను తీసుకువచ్చి వ్యాపార కేంద్రంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్‌కు నీరు ఇస్తామని అన్నారు. విద్య, నీటి పారుదల విషయంలో ఆదిలాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సిద్ధమని, కానీ ఎక్కడ నిర్మించాలో జిల్లా ప్రజాప్రతినిధులు కలిసి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. ఆదిలాబాద్‌కు విశ్వవిద్యాలయం ఇచ్చే బాధ్యత నాదే, కానీ ఎక్కడ కావాలో మీరే నిర్ణయించుకోండని అన్నారు. తన ఆలోచన మేరకు ఇంద్రవెల్లి బాగుంటుందని, అయితే ఇది తన సూచన మాత్రమేనని, నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టే మన వద్ద రెండేళ్లుగా వర్షాలు బాగా కురుస్తున్నాయని, పంటలు సమృద్ధిగా పండుతున్నాయని అన్నారు.