|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 03:26 PM
కేంద్ర హోం శాఖ భారీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసం, కార్యాలయ భవనంగా ఉన్న ‘రాజ్ భవన్’ పేరు ఇకపై చరిత్రలో చేరనుంది. గత నెల 25వ తేదీన జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో ‘లోక్ భవన్’గా పేరు మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజ్యాంగబద్ధమైన ఈ మార్పుకు దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
ఇకపై దేశంలో ఎక్కడా ‘రాజ్ భవన్’ అనే పదం అధికారికంగా ఉపయోగించరాదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలో గవర్నర్ పదవి రాజన్యతకు ప్రతీక కాదని, ప్రజల ప్రతినిధిగా పనిచేసే వ్యవస్థ అనే ఉద్దేశంతో ‘లోక్ భవన్’ (ప్రజల భవనం) అనే కొత్త పేరును ఎంచుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయ. ఈ మార్పు ద్వారా రాజ్యాంగ గణతంత్ర విలువలను మరింత బలపరుస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ పేరు మార్పు అమలు జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి అమలు చేయనున్నాయి. రాజ్ భవన్ బోర్డులను తొలగించి లోక్ భవన్ పేరుతో కొత్త బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.
ఆసక్తికరంగా చెప్పాలంటే… ఈ నిర్ణయం కొత్తది కాదు. రెండేళ్ల క్రితమే రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరిగిన గవర్నర్ల సమావేశంలోనే ఈ ప్రతిపాదనపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇప్పుడు దానికి అధికారిక రూపం లభించింది. రాజ్యాంగ పరమైన ఈ చిన్న మార్పు… భారత గణతంత్ర స్ఫూర్తిని మరింత బలంగా ప్రతిబింబిస్తోందని అందరూ భావిస్తున్నారు.