|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:06 PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం వాడివేడిగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చ జరపకుండా, ప్రధాని మరోసారి 'నాటకానికి' తెరలేపారని ఆయన ఘాటుగా విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "గడిచిన 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ గౌరవాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను నిరంతరం కాలరాస్తోంది. ఇందుకు సంబంధించిన ఘటనల జాబితా చాలా పెద్దది" అని ఖర్గే ఆరోపించారు. గత వర్షాకాల సమావేశాల్లోనే దాదాపు 12 బిల్లులను హడావుడిగా ఆమోదించారని ఆయన గుర్తుచేశారు. కొన్ని బిల్లులను 15 నిమిషాల కన్నా తక్కువ సమయంలో, మరికొన్నింటిని అసలు చర్చ లేకుండానే పాస్ చేశారని విమర్శించారు. 'రైతు వ్యతిరేక నల్ల చట్టాలు', జీఎస్టీ, భారత పౌర భద్రతా నియమావళి వంటి వివాదాస్పద చట్టాలను పార్లమెంటులో బుల్డోజ్ చేశారని మండిపడ్డారు.