|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:21 PM
ఉత్తరప్రదేశ్లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు, అత్తారింట్లో అడుగుపెట్టిన కేవలం 20 నిమిషాలకే వారి ప్రవర్తన నచ్చలేదంటూ ఆ బంధాన్ని తెంచుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందిన సమాచారం ప్రకారం.. డియోరియా జిల్లాలో నవంబర్ 25న ఓ జంటకు ఘనంగా వివాహం జరిగింది. జైమాల, ద్వార పూజ వంటి అన్ని సంప్రదాయాలు సక్రమంగా జరిగాయి. నవంబర్ 26న వధువు అత్తారింటికి చేరుకుంది. బంధువులు, స్థానికుల సమక్షంలో ‘దుల్హా చెహ్రా దిఖాయీ’ (వరుడి ముఖం చూపించే) కార్యక్రమం నిర్వహిస్తుండగా, వధువు ఒక్కసారిగా ఆ వేడుకను ఆపేసింది. వెంటనే తన తల్లిదండ్రులను పిలవాలని పట్టుబట్టింది.భర్త, అత్తమామలు ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. కాసేపటికే అక్కడికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు కూడా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అత్తవారి ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చలేదని, వారితో కలిసి ఉండలేనని ఆమె తేల్చి చెప్పింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.విషయం స్థానిక పంచాయితీకి చేరింది. సుమారు ఐదు గంటల పాటు చర్చలు జరిపిన తర్వాత, ఇరుపక్షాల అంగీకారంతో వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పెళ్లి సమయంలో ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు, వస్తువులను తిరిగి ఇచ్చేసుకున్నారు. అనంతరం వధువు తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఘటనపై ‘డయల్ 112’కు సమాచారం అందినా, ఎవరూ అధికారికంగా ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. "పంచాయతీలోనే ఇరు వర్గాలు సామరస్యంగా విడిపోయాయి" అని భలువానీ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ప్రదీప్ పాండే ధ్రువీకరించారు.