|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:18 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సమావేశంతో సీఎం మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిదని స్పష్టం చేశారు. ఈ జిల్లాపై తమ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని తెలియజేస్తూ.. ఖమ్మం జిల్లాను శ్రీరాముడి సాక్షిగా అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా పోషించిన చారిత్రక పాత్రను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. 1969 తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ నుంచేనని.. 60 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం నడవడానికి ఈ ప్రాంతమే కారణమని రేవంత్ రెడ్డి వివరించారు.
60 ఏళ్ల కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును.. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి పెట్టడం ద్వారా ఆయనకు తమ ప్రభుత్వం గౌరవం ఇచ్చిందని పేర్కొన్నారు. డా. మన్మోహన్ సింగ్ సాలన సంక్షోభం నుంచి సంక్షేమం వైపు సాగిందని కొనియాడారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీయే కారణమని.. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ వంటి భారీ ప్రాజెక్టులు జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో కట్టినవేనని రేవంత్ రెడ్డి తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకం అయినా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించామని సీఎం తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ పంపిణీ వంటి ముఖ్యమైన కార్యక్రమాలను ఈ జిల్లా నుంచే మొదలుపెట్టామని చెప్పారు. ఖమ్మం జిల్లాను చూసినప్పుడల్లా తన గుండె సల్లబడుతుందని భావోద్వేగానికి లోనయ్యారు. గత పదేళ్లలో ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శిస్తూ.. ఇకపై కృష్ణా, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని ప్రతి అంగుళం తడవాలని ఆకాంక్షించారు.
జిల్లా అభివృద్ధికి అన్ని అవకాశాలు ఇస్తున్నామని చెబుతూ.. ముఖ్యమైన శాఖలన్నీ ఖమ్మం జిల్లా నాయకులైన భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి వద్దే ఉన్నాయని.. వీరు ముగ్గురూ తలచుకుంటే జిల్లాకు రానిదంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటును ఆయుధంగా ఉపయోగించి మంచి సర్పంచ్‌లను ఎన్నుకోవాలని.. డబ్బుకో, మందుకో ఓటేస్తే గ్రామాలు మునుగుతాయని సూచించారు.