|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:35 PM
హిమాయత్‌నగర్ - ఆదర్శనగర్ బస్తీ పరిసరాల్లో 30 ఏళ్ల మురుగు సమస్యను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యకు గల కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మురుగు నీరు సాఫీగా వెళ్లక.. ఇళ్లలోకి పోటెత్తి బోరు బావుల్లోకి చేరడం, నాలాల్లో కలవడం వల్ల తాగు నీరు కలుషితమౌతోందని వచ్చిన ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. వందడగుల దూరంలో హుస్సేన్‌సాగర్ నాలా ఉండగా.. మురుగుతో పాటు వర్షం పడినప్పుడు వరద ముంచెత్తడానికి గల కారణాలను వాకబు చేశారు. హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహలక్ష్మి రామన్‌గౌడ్ కూడా ఈ పర్యటనలో ఉండి సమస్యను వివరించారు. హిమాయత్‌నగర్‌పై నుంచి వచ్చే మురుగు, వరద నీరు తమ ప్రాంతాలను ముంచెత్తుతోందని ఆదర్శనగర్ బస్తీ వాసులు కమిషనర్ ముందు వాపోయారు. 30 ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదు చేశారు. సమస్యను బస్తీ వరకూ తీసుకు వచ్చి వదిలేయమని.. హుస్సేన్‌సాగర్ నాలా వరకూ పనులు పూర్తి స్థాయిలోనే చేపడతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో వారంతా ఊరట చెందారు.
మురుగు, వరద నీరు ఎటువైపు వాలుగా వెళ్తుందో పరిశీలించి వెంటనే పనులు మొదలు పెట్టాలని అధికారులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు ఆధేశించారు. 6 మీటర్ల మేర కొన్ని పైపు లైన్లు దెబ్బతిన్నాయని.. వాటిని రీప్లేస్ చేస్తే సరిపోతుందని స్థానిక జలమండలి అధికారులు కమిషనర్‌కు వివరించారు. పై నుంచి వస్తున్న వరద, మురుగు నీటిని అంచనా వేసి.. తదనుగుణంగా పెద్ద పైపులు వేయాలని సూచించారు. నివాసాలు పెరుగుతున్నాయి.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పైపులైన్లు వేయాలన్నారు. వర్షాకాలం పూర్తయ్యింది కనుక వెంటనే ఈ పనులు చేపట్టాలన్నారు. హుస్సేన్ సాగర్ రిటైనింగ్ వాల్ కూడా 35 మీటర్ల మేర దెబ్బతినింది.. దీనిని కూడా పూర్తి చేయాలని సూచించారు. హైడ్రా డీఎఫ్‌వో శ్రీ యజ్జనారాయణ గారు, జలమండలి డీజీఎం శ్రీ కృష్ణయ్య, జీహెచ్ ఎంసీ డీ ఈ శ్రీ ప్రవీణ్‌కుమార్, హైడ్రా ఎస్ ఎఫ్ వోలు శ్రీ పి.దత్తు, శ్రీ సీహెచ్ శ్రీనివాస్‌తో పాటు పలువురు అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు.