|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 07:30 PM
సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో, సామాజిక ఘర్షణలు, తీవ్రవాదాన్ని అరికట్టడం, అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో పోలీసులదే ప్రధాన పాత్ర. అయితే కొందరు పోలీసుల ప్రవర్తన వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది. అందుకే చాలా మంది పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటేనే జంకుతారు. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు.. పోలీసు ఉన్నాతాధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా ప్రజలకు అత్యుత్తమమైన, ప్రజల మెప్పు పొందే సేవలు అందించిన పోలీస్ స్టేషన్లను గుర్తిస్తోంది కేంద్రం. వాటిని అత్యుత్తమ పోలీస్ స్టేషన్లుగా ప్రకటించి ప్రశంసిస్తోంది. తాజాగా అలాంటి పది పోలీస్ స్టేషన్లను గుర్తించింది. అందులో హైదరాబాద్ కమిషనరేట్‌లోని శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు స్థానం దక్కింది. దీంతో స్టేషన్‌ను అత్యుత్తమంగా నిలిపిన శామీర్‌పేట్ పోలీసులను అందరూ అభినందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లలో.. శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ 7వ స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణలో మొదటి ప్లేస్ దక్కించుకుంది. పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా (ఫ్రెండ్లీగా) వ్యవహరించడం, బాధితులు ఇచ్చిన ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను కేంద్ర హోం శాఖ పరిగణనలోకి తీసుకుని.. శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌ను ఎంపిక చేసింది. అంతేకాకుండా స్టేషన్ పరిసరాలను పరిశుభ్రత ఉంచడం, గార్డెనింగ్, ఉత్తమ CCTNS నెట్వర్క్ పని, సిబ్బంది వృత్తి నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంది.
కాగా, ఈ జాబితాలో ఢిల్లీలోని ఘాజీపుర్ ల్యాండ్‌ఫిల్ పోలీస్‌స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్‌స్టేషన్లను హోంశాఖ ఎంపిక చేస్తుంది. ఇందులో ఏడో స్థానంలో శామీర్‌పేట్ పీఎస్ నిలవడంతో.. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ బాలగంగిరెడ్డి, శామీర్‌పేట్ ఇన్స్‌పెక్టర్ శ్రీనాథ్‌తో పాటు సిబ్బందిని అభినందించారు ఉన్నతాధికారులు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి జోన్ యాదగిరిగుట్ట పోలీసు సర్కిల్‌లో ఉన్న ఆలేరు పోలీస్ స్టేషన్ .. 2021లో ఇలాంటి ఘనతే సాధించింది. ఆ ఏడాది 36 పోలీసు స్టేషన్లను అత్యుత్తమైనవిగా గుర్తించగా.. ఆలేరు 32వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఉత్తమ పోలీస్ స్టేషన్ జాబితాలో స్థానం సంపాదించడం సులభమైన విషయమేం కాదు. 360 అంశాలను పరిగణలోకి తీసుకుని 2021లో 36 ఉత్తమ పోలీస్‌స్టేషన్‌ను ఎంపిక చేశారు.