|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 07:49 PM
పోలీసుల కీలక ప్రకటన: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం, నెంబర్ ప్లేట్ మార్చి చూపించడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వంటి చర్యలు రవాణా శాఖ నియమాల ప్రకారం పూర్తిగా చట్టవిరుద్ధం.అయితే ఈ రూల్స్‌ను చాలామంది పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా, సరైన వయసు లేకుండానే బైక్ నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో వాహనం నడుపుతున్నవారితో పాటు పక్కవాళ్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ఘటనలను తగ్గించడానికి ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఎప్పటి నుంచో ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు విధిస్తూ వస్తోంది.గతంలో ఈ జరిమానాలపై 60% నుంచి 70% వరకు డిస్కౌంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల “100% ట్రాఫిక్ చలాన్ మాఫీ” అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.దీనిపై స్పందించిన ట్రాఫిక్ పోలీస్ శాఖ—ప్రస్తుతం ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించలేదని స్పష్టం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల అదాలత్ నిర్వహించడం వల్ల కొద్ది రకాల చలాన్లపై సడలింపులు ఇచ్చారు. అదే విషయాన్ని కొందరు 100% చలాన్ మాఫీగా తప్పుగా మార్చి ఫేక్ న్యూస్‌గా ప్రచారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.పోలీసుల ప్రకారం—గతంలో చలాన్లపై తగ్గింపు ఇచ్చినప్పటికీ, గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. జరిమానాలు వసూలు చేస్తూనే తగ్గింపులు ఇచ్చే పద్ధతి వాహనదారుల్లో భయం తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా భారీ ఫైన్లు విధించినప్పటికీ, వాటి అమలు విషయంలో పోలీసుల చర్యలు కొంతవరకు తగ్గాయని విమర్శలు ఉన్నాయి.ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే హెల్మెట్ విషయంలో మాత్రం ఇంకా కఠినత అనేది కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. హెల్మెట్ వాడకంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. అలాగే వాహన ధ్రువపత్రాలు లేని వాహనాలు, గడువు ముగిసిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.