|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 07:35 PM
తెలంగాణలో మద్యం అమ్మకాలు మళ్లీ రికార్డు సృష్టించాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు భారీగా మద్యం అమ్ముడుపోయింది. నాలుగు రోజుల్లో దాదాపు రూ. 600 కోట్లు మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే లిక్కర్ సేల్స్ 107 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. తెలంగాణలో చలి పులి పంజా విసురుతున్నా.. బీర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. చల్ల గాలిలోనూ చిల్డ్ బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారట తెలంగాణ మద్యం ప్రియులు. అందుకే నాలుగు రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నాలుగు రోజుల్లో 4.26 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడు కావడం గమనార్హం.
తెలంగాణ వ్యాప్తంగా మద్యం సేల్స్ జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ రాత్రి వరకు 578.86 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2023-2025 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ రెండేళ్లలో మద్యం అమ్మకాలు పెరిగాయని తెలుస్తోంది. గత రెండు సంవత్సరాల్లో 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయని సమాచారం. కాగా, 2023లో మద్యం పాలసీ ప్రారంభం కాగా.. డిసెంబర్‌లో ఏకంగా రూ. 4,297 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు రూ. 37,485 కోట్ల లిక్కర్ తాగేశారు మద్యం ప్రియులు. ఇక 2025లో జనవరి నుంచి నవంబరు వరకు రూ. 29,766 కోట్ల అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి.
లిక్కర్ సేల్స్ పెరగడానికి కారణాలివే..
తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డ్ సృష్టించడానికి.. కొత్త మద్యం పాలసీతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు కారణమని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. కాగా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడికక్కడ దావత్‌లు జరుగుతున్నాయి. దీంతో లిక్కర్‌కు డిమాండ్ పెరిగింది. కాగా, ఇంతకుముందు దసరా సందర్భంగా కూడా తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. గమ్మత్తైన విషయం ఎంటే.. దసరా పండుగా, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చినా.. మద్యం అమ్మకాల జోరుగా సాగాయి.
ఈ ఏడాది దసరా పండుగకు రూ. 419 కోట్లు మద్యం తాగేశారు మద్యం ప్రియులు. ఇదిలా ఉండగా, మునుగోడు నియోజకవర్గంలో మాత్రం మద్యం షాపుల నిర్వహణపై షరతులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మద్యం షాపుల నిర్వహణపై తనదైన శైలిలో కొన్ని షరతులు విధించారు. అందులో భాగంగా ఊరి చివరనే మద్యం షాపులు, మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే అమ్మకాలు, పర్మిట్ రూములకు సాయంత్రం 6 గంటల తర్వాతే అనుమతిస్తున్నారు.