|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 07:26 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యంతో పాటు.. కొత్త రేషన్ కార్డుల పంపిణీని నిరంతరంగా కొనసాగిస్తోంది. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన 'ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల' కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
నల్గొండ జిల్లాలోనే లక్ష రేషన్ కార్డులు..
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని మంత్రి గుర్తు చేశారు. అయితే.. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే దేవరకొండ నియోజకవర్గంలో 14 వేల రేషన్ కార్డులను అందించినట్లు తెలిపారు.
ఒక్క నల్గొండ జిల్లాలోనే లక్షకు పైగా రేషన్ కార్డులను మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించి వారి ఆకలి తీరుస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. ప్రభుత్వం త్వరలోనే వాటిని పరిశీలించి మంజూరు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్, అలాగే బస్సులకు యజమానులుగా మహిళలను చేసేందుకు చర్యలు వంటి పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా విపక్షాల విమర్శలను పట్టించుకోవద్దని.. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని మంత్రి ప్రజలను కోరారు.