|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:49 PM
ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో జరుగుతున్న శాంతి చర్చలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఇంకా చదవలేదని, చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధంగా లేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో మూడు రోజుల పాటు అమెరికా, ఉక్రెయిన్ అధికారుల మధ్య చర్చలు ముగిసిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కెన్నెడీ సెంటర్ ఆనర్స్‌కు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంకా ప్రతిపాదనను చదవలేదని తెలిసి నేను కాస్త నిరాశ చెందాను. ఉక్రెయిన్ అధికారులు దీన్ని ఇష్టపడుతున్నారు. కానీ, ఆయన మాత్రం సిద్ధంగా లేరు" అని అన్నారు. రష్యా ఈ ప్రతిపాదనకు అనుకూలంగానే ఉందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.