|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:38 PM
దేశీయ విమానయాన రంగంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో కార్యకలాపాలు నిలిచిపోవడం, భారీగా విమానాలు రద్దు కావడంతో టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ఈ పరిణామంపై స్పందించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలపై పరిమితులు విధిస్తూ 6న ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎయిర్ ఇండియా గ్రూప్ తమ రిజర్వేషన్ సిస్టమ్స్‌లో కొత్త ధరల విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ మార్పులను పూర్తి చేయగా, ఎయిర్ ఇండియా విమానాల్లో కూడా అన్ని బుకింగ్ ఛానళ్లలో కొత్త ధరలను క్రమంగా అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఈ మార్పులు అన్ని సిస్టమ్స్‌లో కనిపిస్తాయని తెలిపింది.థర్డ్-పార్టీ రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్‌లతో సమన్వయం చేసుకోవాల్సి ఉన్నందున, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దశలవారీగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్నామని ఎయిర్ ఇండియా వివరించింది.ఈ మార్పుల సమయంలో, ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ బేస్ ఫేర్‌తో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని కూడా ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.