|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 07:20 PM
నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన యువతకు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు పొందే అద్భుతమైన అవకాశం లభించింది. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ బీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహించబడుతోంది. ఈ విషయాన్ని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అధికారికంగా తెలియజేశారు.
అర్హతలు..
ఈ ఉద్యోగ మేళాకు కేవలం ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే కాకుండా.. జిల్లాలోని ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో చదివిన అర్హత కలిగిన విద్యార్థులందరూ హాజరుకావచ్చు. 2024-25 విద్యా సంవత్సరంలో ఎంపీసీ, ఎంఈసీ, మ్యాథమాటిక్స్ సబ్జెక్ట్‌తో ఉన్న గ్రూపులు ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే ఈ మేళాకు అర్హులుగా పేర్కొన్నారు.
హెచ్‌సీఎల్ టెక్ బీ సంస్థ నిర్దేశించిన మార్కుల ప్రమాణాలను అభ్యర్థులు కలిగి ఉండాలి. అంటే.. ఇంటర్‌లో మొత్తం ఓవరాల్‌గా 75 శాతం మార్కులు సాధించాలి. అంతేకాకుండా.. ముఖ్యంగా మ్యాథమాటిక్స్ సబ్జెక్టులో 60 శాతం మార్కులు పొందిన వారు మాత్రమే ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఉద్యోగ మేళా నిర్వహణ కోసం నిజామాబాద్‌లోని వర్ని రోడ్డు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఉదయం 10 గంటలకు ఆల్ఫోర్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న శ్రీ వేంకటేశ్వర కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ లో ఈ డ్రైవ్ ప్రారంభమవుతుంది.
అభ్యర్థులు తమ వెంట 10వ తరగతి పాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మార్కుల సర్టిఫికెట్ (ఒరిజినల్ మరియు జిరాక్స్), ఆధార్ కార్డు (ఒరిజినల్ మరియు జిరాక్స్), ఒక ఫోటో అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ను తప్పనిసరిగా తీసుకుని రావాలని అధికారులు సూచించారు. ఈ ఉద్యోగ మేళాకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు హెచ్‌సీఎల్ కంపెనీ ప్రతినిధి సెల్ ఫోన్ నెంబర్ 8074065803 ను సంప్రదించవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని యువత తమ నైపుణ్యాలకు తగిన ఉద్యోగాన్ని పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ కోరారు.