|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 07:53 PM
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చూడటానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో రేపు (డిసెంబర్ 9) సాయంత్రం 5 గంటల నుంచే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
మూడు విడతల్లో మద్యం నిషేధం..
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీలలో మూడు విడతల్లో జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ ప్రాంతాల్లో.. ఈ తేదీలకు ముందు, పోలింగ్ ముగిసి ఫలితాలు వెల్లడయ్యే వరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
డిసెంబర్ 11వ తేదీన ఎన్నికల సందర్భంగా.. రేపు (డిసెంబర్ 9) సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 11న ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఆయా మండలాల్లోని మద్యం దుకాణాలు మూతపడతాయి. ఈ తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,236 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండవ విడత (డిసెంబర్ 14) ఎన్నికల సందర్భంగా.. డిసెంబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 14న ఫలితాలు వచ్చేంత వరకు ఆయా గ్రామాల్లో మద్యం నిషేధం అమలవుతుంది. మూడవ విడత (డిసెంబర్ 17) ఎన్నికల సందర్భంగా.. డిసెంబర్ 15న సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 17న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఆయా మండలాల్లోని మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేసి ఉంచుతారు.
ఈ నిషేధాజ్ఞలు కేవలం వైన్ షాపులకు మాత్రమే కాకుండా.. ఎన్నికలు జరిగే ప్రాంతాల పరిధిలోని బార్లు , అలాగే మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లకు కూడా వర్తిస్తాయని కలెక్టర్లు స్పష్టం చేశారు. అధికారులు జారీ చేసిన ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు తెరిచినా.. లేదా దొంగచాటుగా మద్యం విక్రయించినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల ప్రాంతాల్లో అధికారులు నిఘాను పెంచారు. ఈ ఎన్నికల్లో నాయకులతో పాటు ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ.. తమ గ్రామ భవిష్యత్తును నిర్ణయించే సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రమే ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు.